ప్రవాస భారతీయులు మనదేశంలో మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు... కానీ షరతులు వర్తిస్తాయి. ఫెమా నిబంధనలకు లోబడి ఈ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు విదేశీ కరెన్సీలో పెట్టుబడులను తీసుకోకూడదు కాబట్టి.. ఎన్నారైలు వీటిలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా బ్యాంకులో ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌వో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ ఖాతా అంటే విదేశాల్లో సంపాదించిన సొమ్మును దాచుకునే ఖాతా. ఎంత ఆదాయాన్నైనా ఈ ఖాతాలోకి పంపవచ్చు. దానిపై వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం. ఎన్‌ఆర్‌వో ఖాతా అంటే.. విదేశాల్లో ఉంటున్నవారికి భారతదేశంలో ఉండే ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం దాచుకునే ఖాతా. అంటే ఇంటి అద్దెలు, వ్యాపారాలు, ఇతరత్రా పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం దాచుకునే ఖాతా. ఈ సొమ్ముపై వచ్చే వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతా ఉన్న ఎన్నారైలు వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే తమ పాస్‌పోర్ట్ నకలు ప్రతిని, విదేశంలో తాము ఉంటున్న చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల్లో భాగంగా ఫండ్స్ నిర్వాహక సంస్థకు అందజేయాలి. తమ తరఫున పెట్టుబడి పెట్టేందుకు, లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను రిడీమ్ చేసుకునేందుకు ఎన్నారైలు తమ బంధువులకు లేదా స్నేహితులకు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోయే) ఇవ్వచ్చు. అయితే, యూనిట్లను కొనేటప్పుడు పీవోయే హోల్డర్ పవర్ ఆఫ్ అటార్నీ అసలు ప్రతిని చూపించాల్సి ఉంటుంది. పీవోయే రిజిస్టర్ అయ్యాక పీవోయేహోల్డర్ ఎన్నారై తరఫున మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదా ఉపసంహరించవచ్చు. అమెరికా, కెనడాల్లో ఉండే ఎన్నారైలు మనదేశంలో నడిచే అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోనూ కొన్ని నిబంధనల కారణంగా పెట్టుబడులు పెట్టలేరు. కాబట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందే దాని గురించి తెలుసుకోవాలి. పన్నుల భారం.. ఎన్నారైలు ఈక్విటీ లేదా డెట్ ఫండ్స్... వేటిలో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, వాటిపై వచ్చే స్వల్ప లేదా దీర్ఘకాలిక మూల ధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పన్ను అనేది ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ పథకం, పెట్టుబడులు ఎంత కాలం ఉంచారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ పథకాలైతే ఏదైనా ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఏడాది తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై దీర్ఘ కాలిక మూల ధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ లాభాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. మొన్నటి కేంద్ర బడ్జెట్ నుంచి ఈక్విటీ పథకాలపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పైనా పన్ను భారం పడుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లాభాలు రూ.లక్ష మించితే, ఆ అదనపు మొత్తంపై 10 శాతం చొప్పున ఎల్‌టీసీజీ చెల్లించాలి. అదే ఏడాదిలోపైతే ఎలాంటి మినహాయింపు లేకుండా 15 శాతం చొప్పున స్వల్ప కాలిక మూలధన లాభాల (ఎస్‌టీసీజీ) పన్ను చెల్లించాలి. రుణ పథకాలు రుణ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులను మూడేళ్లలోపే అమ్ముకుని లాభాలు పొందితే, ఆ లాభాలను ఆయా వ్యక్తుల ఆదాయానికి కలిపి, ఆయా శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. అదే మూడేళ్ల తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20% చొప్పున ఎల్‌టీసీజీ చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం వద్దను కుంటే 10% చొప్పున ఎల్‌టీసీజీ చెల్లిస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment