ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) దేశంలోని బ్యాంకుల్లో ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతాలు నిర్వహిస్తుంటారు. చట్ట ప్రకారం ఆరు నెలలకు మించి విదేశాల్లో ఉండే భారతీయుల్ని ఎన్‌ఆర్‌ఐలుగా పరిగణిస్తారు. వీరు అందరిలా దేశంలోని బ్యాంకుల్లో సాధారణ ఖాతాలు కలిగే ఉండేందుకు వీల్లేదు. అయితే విదేశాల్లో వీరు సంపాదించిన డబ్బులు స్వదేశానికి పంపాలన్నా లేదా అప్పటికే స్వదేశంలోని బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాలోని డిపాజిట్లు కొనసాగించాలన్నా బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఐలు దేశంలోని బ్యాంకుల్లో నాన్ రెసిడెంట్ రూపీ (ఎన్‌ఆర్‌ఈ) లేదా నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ (ఎన్‌ఆర్‌ఓ) పేరుతో ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. భారత పౌరుడు విదేశాలకు వెళ్లి స్థిరపడితే అతడు ఇతర సాధారణ భారతీయుల మాదిరిగా దేశంలోని బ్యాంకుల్లో రెసిడెంట్ సేవింగ్ ఖాతా కలిగి ఉండేందుకు అనుమతించరు. అలా ఖాతా కలిగి ఉండడం విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు వ్యతిరేకం. అందుకే ఎన్‌ఆర్‌ఐలు ముందుగానే తమ రెసిడెంట్ సేవింగ్స్ ఖాతాను ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతాగా మార్చుకోవాలి. ఎన్‌ఆర్‌ఈ ఖాతా ఎన్‌ఆర్‌ఐలు విదేశాల్లో సంపాదించిన విదేశీ కరెన్సీని ఎప్పటికపుడు ఈ ఖాతాలో జమ చేయాలి.ఆ రోజు ఉన్న కరెన్సీ మార్పిడి రేటు ప్రకారం ఆ మొత్తం ఎన్‌ఆర్‌ఈ ఖాతాలో వెంటనే రూపాయల్లోకి మారిపోతుంది.ఇందులో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా ఎలాంటి పరిమితులు లేకుండా వెనక్కి తీసుకోవచ్చు.ఎన్‌ఆర్‌ఈ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం, ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి రాదు. ఎన్‌ఆర్‌ఐలు దేశంలోని మరో భారతీయుడితో కలిసి ఉమ్మడిగా ఎన్‌ఆర్‌ఈ ఖాతా కలిగి ఉండేందుకు అనుమతించరు. మరో ప్రవాస భారతీయుడితో కలిసి మాత్రం ఉమ్మడిగా ఎన్‌ఆర్‌ఈ ఖాతా కలిగి ఉండవచ్చు. ఎన్‌ఆర్‌ఓ ఖాతా భారత్‌లోని పెట్టుబడులు, ఆస్తులపై వడ్డీ, డివిడెండ్, అద్దెల రూపంలో ఆదాయాన్ని ఉంచేందుకు ఎన్‌ఆర్‌ఓ ఖాతా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఎన్‌ఆర్‌ఐలు ఈ ఖాతా నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలి. పన్నులేమైనా ఉంటే అవి పూర్తిగా చెల్లించాకే, ఈ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐలు డబ్బులు వెనక్కి తీసుకోవాలి. అది కూడా ఏడాదికి 10 లక్షల డాలర్లు మించొద్దు. ఎన్‌ఆర్‌ఓ ఖాతాలోని డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం ఆ దాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎన్‌ఆర్‌ఐలు తమ ఆదా య పన్ను రిటర్న్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఎన్‌ఆర్‌ఐలు మరో ఎన్‌ఆర్‌ఐతో కలిసి లేదా స్థానిక భారతీయులతో కలిసి (దగ్గరి బంధువు) ఎన్‌ఆర్‌ఓ ఖాతా తీసుకోవచ్చు. డిపాజిట్లు, ఉపసంహరణ నిబంధనలు విదేశాల్లో సంపాదించిన సొమ్మును ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల్లో దేనిలోనైనా డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని పెట్టుబడులు, ఆస్తులపై వచ్చే రాబడులను మాత్రం ఎన్‌ఆర్‌ఓ ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఈ ఖాతాల్లోని మొత్తాన్ని రూపాయల్లో మాత్రమే తీసుకోవాలి. ఎన్‌ఆర్‌ఈ ఖాతాల్లోని సొమ్మును వెనక్కి తీసుకునేటప్పుడు మాత్రం ఫారెక్స్ మార్కెట్ ఆటుపోట్ల రిస్కు తప్పదు.
No comments:
Post a Comment